భాజపా ధ్రుతరాష్ట్ర కౌగిలి నుంచి పవన్ కల్యాణ్ బయటపడుతున్నట్టే ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆహ్వానించదగ్గ పరిణామం. తెదేపా-జనసేన కలిస్తే 2024లో కనీసం గట్టిపొటీని ఆశించవచ్చు.
జనసేన ప్రాబల్యం ప్రస్తుతానికి 5-10% కే పరిమితం. ఇది పవన్ గుర్తించి టిక్కెట్ల సర్దుబాటులో తదనుగుణంగా నడుచుకుంటే మంచిది. ఏదో కింగ్ మేకర్గా ఊహించుకుని, తన ప్రాబల్యం 30-35% అని విర్రవీగి ఒంటరిగా వెళితే 2029 కల్లా జనసేన గల్లంతు కావడం తధ్యం. 2024లో 5-10 సీట్లు సాధించగలిగితే జనసేన తన ఉనికిని కాపాడుకోవచ్చు. అలాగే 2029లో త్రిముఖ పోటీని మనం ఆశించవచ్చు.
ఏది ఏమయినా వచ్చే 15 ఏళ్ళలో ఏవో రెండు పార్టీలు మాత్రమే బరిలో నిలుస్తాయి. దీనికి కారణం ప్రస్తుతమున్న First Past The Post (FPTP) ఎన్నికల పద్దతిలో మూడో పార్టీకి స్థానం లేకపోవడమే. వైకాపా-తెదేపా-జనసేన లొ ఏ రెండు నిలుస్తాయో అన్నది ఆ పార్టీల నాయకత్వ సామర్ధ్యంపై ఆధారపడి ఉంది.
పవన్ లో నిలకడ, జనసేన పార్టీ విధానాల్లో స్పష్టత మెరుగుపడకపోతే రాజకీయ ఉనికి కష్టమే. అసలు ఏమి ఆశించి భాజపాతొ అంటకాగ చూశాడో పవన్ కే తెలియాలి. అన్న నాగేంద్రబాబుని పార్టీనించి ఎంత దూరం పెడితే అంత మంచిది. పార్టే నిధుల కోసం పవన్ సినిమాలు చేయడాన్ని మించి పెద్ద జోక్ రాజకీయాల్లో ఉండదేమో! తాను కేవలం కాపు కులానికే ప్రతినిధా, కాదు అందరివాడా అన్నదానిపై స్పష్టత చూపెట్టాలి.
అటు చూస్తే, తెదేపా నాయకత్వ మార్పు జరుగుతున్న కీలకమయిన సంధి దశలో ఉంది. రాజకీయ నైపుణ్యం-తీవ్రత-ఎత్తుగడల్లో చాకచక్యం గురించి మాట్లాడితే జగన్ మిగతా ఇద్దరికంటే ఒక జనరేషన్ ముందున్నాడు. కానీ అతని ఆటలు ఎంతకాలం సాగుతాయో అన్నది భాజపా ఆంధ్రప్రదేశ్ స్ట్రాటజీపై ఆధారపడి ఉన్నది. తెదేపా-వైకాపాలు రెండూ బలంగా ఉన్నంత కాలం, భాజపాకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చోటు లేదు. కానీ కేసులు తిరగదోడి జగన్ ని జైలుకి పంపితే లాభపడేది తెదేపా-జనసేన లే కాని భాజపా కాదు. రజనీకాంత్ లాగ పవన్ కూడా చేజారిపోవడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భాజపా ప్రస్తుతం దిక్కు తోచని పరిస్థితుల్లో ఉందన్నది తేటతెల్లం!