తెలుగుదేశం పార్టీ వినాశనాన్ని భాజపా కోరుకుంటుందని 2014-2019 మధ్యలోనే స్పష్టమయ్యింది. భాజపాలో ఉండి తెదేపాకు అనుకూలంగా వ్యవహరిస్తాడని పేరున్న వెంకయ్య నాయుడిని ఉపరాష్త్రపతి పదవిలో కూర్చోబెట్టి అడ్డు తొలగించుకొంది. ఈ కింది విషయాల్లో తెదేపా ప్రభుత్వానికి ఎటువంటి మద్దతు ఇవ్వకుండా, NDA లోంచి పొమ్మనకుండా పొగ పెట్టింది:
- స్పెషల్ స్టేటస్ / స్పెషల్ ప్యాకేజీ
- రెవెన్యూ లోటు నిధులు
- పోలవరం ప్రాజెక్ట్ కి సకాలంలో సరిపడా నిధులు
- రాజధాని నిర్మాణానికి సరిపడా నిధులు
- విశాఖపట్నం కి కొత్త రైల్వే జోన్
- IIT, IIM, AIIMS ల ఏర్పాటుకు నిధులు
- జగన్ పై కేసులు తేల్చడం
2014-2019 మధ్యలోనే భాజపా జగన్ తో మంతనాలు జరిపింది. రాజ్యసభలో మైనారిటీ ఉండడంతో జగన్ మద్దతు తీసుకొంది. 2019లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత జగన్ భాజపాకి అనుకూలంగా ఉండడం, అంబానీ-అదానీలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం అందరికీ తెలిసిందే.
ప్రాంతీయ పార్టీల పై భాజపా చేస్తున్న ప్రచ్చన్న యుద్ధం అందరికీ తెలిసిందే. కుటుంబ పార్టీలని చీల్చి, వారి ప్రభుత్వాలను కూల్చి, ఆ పార్టీల పతనాన్ని వేగవంతం చేయడం చూస్తూనే ఉన్నాం. ఆ వరుసలోదే AP లో భాజపా వైఖరి! నాయకత్వ బదిలీ దశలో ఉన్న తెలుగుదేశాన్ని అధికారానికి దూరంగా ఉంచి, బలహీన పడేటట్లు చేసి, జగన్ ప్రభుత్వంపై క్రైస్థవ ముద్ర స్పష్టమయ్యేదాక వేచి చూసి, ఆపై హిందూ మతం ప్రమాదంలో పడిందన్న వాదాన్ని తెచ్చి 2029 నించి మెల్లగా తెదేపా స్థానాన్ని ఆక్రమించాలని పెద్ద ప్రణాళిక రచించింది భాజపా! ఒక్క మాటలో చెప్పాలంటే భాజపాకు అసదుద్దీన్ ఓవైసీ ఎంత ముఖ్యమో, జగనూ అంతే! ఈ యిన్-యాంగ్ ల సంబంధం ఓట్లను కొల్లగొట్టడంలో భాజపాకు తురుపుముక్క.
ఇంత చేసినా, భాజపా ఉద్దేశాలు ఇంత స్పష్టంగా ఉన్నా, చంద్రబాబు-పవన్ లు భాజపాతో జట్టు కట్టడం విచిత్రం! కూటమి విషయంలో భాజపా కాపట్యం బయటపడటానికి ఎన్నికల దాక వేచి చూడక్కరలేదు. రఘురామ క్రిష్ణమరాజు (RRR) విషయంలోనే అది స్పష్టమయ్యింది; భాజపా-వైసీపీ లోపాయికారి సంబంధం ప్రస్ఫుటమయ్యింది.
ఈ ఎన్నికల్లో APలో కూటమి విజయం భాజపాకి అనవసరం. భాజపాకి కావలసిందల్లా తెదేపా బలహీనపడడం. పైపైకి ఎలా కనిపించినా, 2024లో APలో వైసీపీ విజయం భాజపా AP ధీర్ఘకాలిక వ్యూహంలో ఒక భాగం! చంద్రబాబు-పవన్ లు ఎన్ని ప్రయత్నాలు చేసినా భాజపాను ఈ వ్యూహాన్నుంచి విరమింపచేయలేరు!