Saturday, August 12, 2023

అవినీతిని నియంత్రించడం ఎలా?

రాజకీయాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి పై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో అందరికీ తెలిసిందే. 2014లో కాంగ్రెస్ ని గద్దె దించడంలో 2G మరియు ఇతర కుంభకోణాల పట్ల ప్రజల్లో ఉన్న అసహనం పాత్ర ఎంతైనా ఉంది. అన్నా హజారే నాయకత్వంలో నడిచిన అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని, దాని పర్యవసానంగా ప్రజల్లో అవినీతిపై పెల్లుబికిన ఆగ్రహాన్నీ, కాంగ్రెస్ వ్యతిరేకతనీ మోడీ-షా చక్కగా ఉపయొగించుకొని 2014లో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారన్నది జగమెరిగిన విషయమే.

అవినీతి పై ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఉన్నా, దాని పర్యవసానాల పట్ల ప్రజా బాహుళ్యంలో ఇంత ప్రతికూలతా-అసహనం ఉన్నా, అసలు అవినీతి ఎలా సాధ్యమవుతుంది అన్న దానిపై ప్రజల్లో పూర్తిగా అవగాహన లోపించింది! ఎంత కాలం పార్టీలనూ, నాయకులనూ, ప్రభుత్వ అధికారులనూ నిందించడం తప్ప అసలు ఈ సమస్య ఎందుకు ఉత్పన్న మవుతుందన్న దానిపై ప్రజల్లో ప్రాధమిక అవగాహన కూడా కొరవడింది!

సరే, మరి అవినీతి ఎలా ఉత్పన్న మవుతుంది? ఎవరు బాధ్యులు? అన్న ప్రశ్నకు చాలా సరళమైన, ఖచ్చితమైన సమాధానం ఉంది! జన జీవితంలో రాజ్యం పరిధి-నియంత్రణ-అధికారం ఎంత ఎక్కువగా ఉంటే అవినీతి అంతే ఎక్కువగా ఉంటుంది! అవినీతిని తగ్గించాలంటే రాజ్యం పరిధిని తగ్గించాలి! అది చేయకుండా నినాదాలూ, కాకమ్మ కబుర్లూ చెబితే అవినీతి తగ్గదు!

ప్రభుత్వ పరిధిని రోజు-రోజుకూ పెంచుతూ, అనవసరమయిన నిబంధనలు-నియంత్రణ పెంచుతూ, ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణను వాయిదా వేస్తూ, లేదా ఒక దానిలో ఇంకొకటి విలీనం చేస్తూ, ఎగుమతి-దిగుమతులను ఎప్పటికప్పుడు నియంత్రిస్తూ, పరిశ్రమలనూ-ఉత్పత్తినీ కుదేలు చేసేలా అధిక సుంకాలు వసూలు చేస్తూ, పి.వి. నరసింహా రావు మొదలు పెట్టిన, వాజపేయి కొనసాగించిన సంస్కరణలను అలాగే కొనసాగించకుండా వాయిదా వేస్తూ, ప్రజల నడుం విరిగేలా అధిక పన్నులు విధిస్తూ, ఎప్పటికప్పుడు తమ రాజకీయ పబ్బం గడుపుకుంటూ, మాది అవినీతి రహితమయిన ప్రభుత్వం అని మోడీ-షా జబ్బలు చరుచుకుంటుంటే ఒక వైపు జనం, మరో వైపు ప్రతిపక్షాలు-మీడియా చోద్యం చూస్తున్నాయి తప్పితే ఏమీ చేయలేకపోతున్నాయి!

9 ఏళ్ళ NDA ప్రభుత్వంలో నా మంత్రులందరూ మచ్చ లేని వారు, ఒక్క కుంభకోణం కూడా ఎరగని పరిశుద్ధమయిన ప్రభుత్వం నాది అని మోడీ అనవచ్చు. నిజమే కదా మరి! కానీ, ప్రజల నిత్య జీవితం ఏమయినా మెరుగు పడిందా, అవినీతి ఏమన్నా తగ్గిందా అంటే అస్సలు లేదనవచ్చు! ఎందుకంటే మంత్రుల అవినీతి ప్రభావం ప్రజల నిత్య జీవితంపై చాలా తక్కువ. మన బతుకులపై wholesale అవినీతి కంటే చిన్న మొత్తాల retail అవినీతి ప్రభావం అధికం!

అసలు ఈ అవినీతికన్నా నష్టపరిచేది అనవసరమయిన నియంత్రణలూ, పన్నులూ, సుంకాలు! అవినీతి ఉంటే అధికారి చేయి తడిపి వ్యాపారవేత్తలైనా, ప్రజలయినా తమ పనులు ముందుకు నెట్టుకోవచ్చు. కానీ లాప్టొప్ కొనాలంటే ఈ లైసెన్స్ తీసుకోవాలి, వ్యాపారం మొదలు పెట్టాలంటే ఆ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయాలంటే, దాని ప్రభావం మన దేశ ఆర్ధిక ప్రగతిపై, విదేశీ పెట్టుబడులపై, ఉద్యొగాలపై, మన తలసరి ఆదాయంపై, మన జీవన ప్రమాణాలపై పడుతుంది. కాకపొతే, ఈ ప్రభావం మనకు పెద్దగా తెలీకుండానే పడుతుంది. రోరోజుకీ ఏమీ తెలీదు కానీ, దశాబ్దాల తర్వాత పరికిస్తే, మనతో సమానంగా ఉన్న చైనా మన తలసరి ఆదయానికి 5 రెట్లతో దూసుకెళుతూ ఉంటుంది. మనం మాత్రం పడుతూ-లేస్తూ మనలో మనం Make in India, Viswa Guru అనుకుంటూ జబ్బలు చరుచుకుని సంతౄప్తి పడదాం!

మంత్రులకు నిర్ణయాధికారమిస్తే వారు ఎక్కడ పేట్రేగి, కుంభకోణాలు చేస్తారో అన్న భయంతో వారిని దిష్టిబొమ్మల్లా నిలబెట్టి, 1970-80 ల నాటి సోషలిస్టు, సంరక్షణవాద విధానాలను ఇంకా గుడ్డిగా నమ్మే ప్రభుత్వ ఉన్నతాధికారులతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు మోడీ! Minimum Government, Maximum Governance అన్న నినాదానికి కనీస అర్ధం మోడీకి తెలీదు! అతని దౄష్టిలో ఆ నినాదానికి అర్ధం దస్త్రాలను (Files) త్వరగా ముందుకు కదిలించడం! ఈ అవగాహనా రాహిత్యాన్ని గట్టిగా ప్రశ్నించలేని, దిక్కు తెలియని ప్రతిపక్షం ప్రజలకు లేని సమస్యలపై పోరాడుతూ కాలక్షేపం చేస్తుంటే, మెల్లగా-తెలీకుండా ఉడుకుతున్న నీళ్ళలో కదలకుండా కూర్చున్న కప్పల్లా ప్రజానీకం వ్యవహరిస్తోంది.

అవినీతి మరక మాకు లేదు అని సన్నాయి నొక్కులు నొక్కే మోడీ-షాలకు ఎన్నికల ఖర్చుల నిధులు ఎలా సమకూరతాయో అన్నది అందరికీ తెలిసిన రహస్యమే! అంబానీ-అదానీ లకు అనుకూలంగా BSNLని నాశనం చెసి, Walmartని రానీయకుండా చేసి, పోర్టులని కట్టబెడుతూ, సాయంగా ED-CBI లను ఉసిగొల్పుతూ రాజ్యాంగ వ్యవస్థలను నీరుగారుస్తూ ఉంటే అచ్చే దిన్, అఖండ్ భారత్ అని పగటి కలలు కంటూ కాలం వెళ్ళబుచ్చే ప్రజానీకం కొంచెం కళ్ళు తెరవాలి.

అవినీతి వ్యతిరేకం అంటూనే Laptopల దిగుమతులూ, బియ్యం ఎగుమతులను నియంత్రిస్తూ ఉన్న మోడీని, వోట్ల కోసం RTC ని ప్రభుత్వంలో విలీనం చేసే కే.సి.ఆర్-జగన్ లాంటి నాయకులను ప్రశ్నించడం మొదలు పెట్టాలి. అవినీతిని తగ్గించాలంటే ప్రభుత్వ పరిధి-నియంత్రణ-అధికారాన్ని తగ్గించాలని, నినాదాలిస్తూ కాకమ్మ కబుర్లు చెబితే అవినీతి తగ్గదని ప్రజలు గుర్తెరగాలి.

No comments: