ఉక్రెయిన్ సమస్య సంక్లిష్టమైనదే! రష్యా ఆధిపత్య పరిధి లో ఉన్న పొరుగు దేశాల్లో అమెరికా జోక్యం పై పుతిన్ ఎన్నోసార్లు తన ఆసంతృప్తిని వ్యక్తపరిచాడు. కానీ, రష్యాని అలా వదిలేస్తే పొరుగు దేశాలను నయనో, భయానో తిరిగి ఆక్రమించి మళ్ళీ సోవియట్ యూనియన్ అంతటి ఆర్ధిక ప్రాభవాన్ని ఎక్కడ సంతరించుకుంటుందో అని అమెరికా భయం!
దేశాధినేతలు తమ దేశం యొక్క భూభాగం మరియు జనాభానే కాదు తమ దేశ చారిత్రక వైభవ కధనాన్ని కూడా వారసత్వంగా పొందుతారు! పుతిన్ తనకు అలెక్జాండర్ III పట్ల ఉన్న ఆరాధ్యభావాన్ని ఎన్నో సార్లు వ్యక్తపరిచాడు. గత రెండు దశాబ్ధాలుగా, రష్యాని ఆర్ధికంగా పరిపుష్టం చేసి, ఆంక్షలను ఎదుర్కొనే లాగా తయారు చేశాడు.
జీడీపీ పరంగా చూస్తే రష్యా అమెరికాలో పదిహేనో వంతే ఉన్నప్పటికీ, మిలటరీ సామర్ధ్యంలో రమా-రమి అగ్ర రాజ్యం కిందే లెక్క! పొరుగు దేశాలను కూడగట్టి, ఆర్ధికంగా బలంగా తయారయ్యి తన ఏకఛత్రాదిపత్యానికి ఎక్కడ ఎసరు పెడుతుందొ అని అమెరికా భయం. అసలే రష్యా ఒక సమర్ధుడయిన నియంత పాలన లో ఉంది! రష్యా అంటే యూరొప్ కి ఎప్పటికీ ఒకింత భయంతో కూడిన అనుమానమే! ఈ భయంతో, అమెరికా నాటోని విస్తరించి ఎస్టోనియా, లాత్వియా, లిథుయేనియా లను నాటోలోకి ఆహ్వానించింది. నాటో సభ్య దేశాలపై దాడి చేస్తే అమెరికాతో సహా నాటో కూటమితో యుద్ధం చెయ్యాల్సి ఉంటుంది. అందుకే జార్జియా, ఉక్రయిన్ లకు నాటొలో చేరాలని అంత ఉబలాటం!
విస్తరణ కాంక్ష లేకపొతే ఈ దేశాల నాటో చేరికపై రష్యాకు అంత మండిపాటు ఎందుకు అన్నది పాశ్చ్యాత్య దేశాల వాదన. రష్యా ఆధిపత్య పరిధి లోకి అంత చొచ్చుకెళ్ళడం ఎందుకని రష్యా సమర్ధకుల వాదన.
2014లో రష్యా ఉక్రెయిన్ పై దాడి చేసి క్రిమియా, డోంబాస్ లను ఆక్రమించింది. గత మూడేళ్ళలో, అమెరికా ఆయుధ బలాన్ని ఎదుర్కొంటూ ఉక్రెయిన్ లో ఐదో వంతును ఆక్రమించింది. ఈ యుద్ధాన్ని ఆఖరి ఉక్రెయిన్ పౌరుడి ప్రాణాలను, ఆఖరి అమెరికా టాక్స్ డాలర్ను ఖర్చు చేసేవరకూ పోరడతామని బైడెన్, జెలెన్స్కీ లు మొండిపట్టు పట్టగా, రష్యా వెరవకుండా యుద్ధం చేస్తూనే వుంది.
ఈ కోల్పోయిన అయిదో వంతు భూభాగాన్ని యుద్ధం మొదట్లోనే ఇచ్చేసి ఉంటే ఇంత ప్రాణ, ధన నష్టం నివారించవచ్చు కదా అని ఒక వైపు వాదన. అలా సులువుగా రష్యాకి లొంగిపొతే, ఆ తరవాత మిగతా పొరుగు దేశాలకూ, పొలాండ్ కూ, స్కాండినేవియన్ దేశాలకు, అట్లాంటిక్ మహాసాగరం అవతల ఉన్న అమెరికాకూ రష్యా ముప్పు తీవ్రమవుతుందని ఇంకొక వైపు వాదన.
ఉక్రెయిన్ తన అణ్వాయుధాలను నిర్వీర్యం చేసేలా ఒప్పించి, తీరా ఆపదలో ఆదుకోక పోతే అమెరికా వాగ్ధానాలకూ, ఒప్పందాలకూ, పెద్దరికానికీ విలువ పోతుందనీ, అది ధీర్ఘకాలంలో చేటు చేస్తుందని బైడెన్-జెలెన్స్కీ సమర్ధకుల వాదన. రష్యా దురాక్రమణకు ఆదిలోనే అడ్డుకట్ట వెయ్యకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని వారి వాదన.
అయితే, ట్రంప్, దశాబ్ద-శతాబ్దానంతర పరిణామాలకు విలువనిచ్చే రాజనీతిజ్ణుడు (Statesman) కాడు. ఈ సంవత్సర బాలన్స్ షీట్ బాగుండేలా నిర్ణయాలు తీసుకునే ఒక పక్కా బిజినెస్ మాన్! నా 350 బిలియన్ డాలర్లను తీసుకొని నువ్వు నాకేమి ఇచ్చావని, లక్షల మంది ప్రాణ నష్టానికీ, లెక్కలేనంత ఆస్థి నష్టానికీ, ప్రపంచ ఆర్ధిక అనిశ్చితికీ, పెట్రొలు ధరలు పెరగడానికీ నీ మొండిపట్టే కారణం అనీ ట్రంప్ వాదన.
ఉక్రెయిన్ భూభాగంలో అయిదవ వంతు తీసుకుని పుతిన్ ఆగుతాడా, మరింత రెచ్చి పోతాడా అన్న ప్రశ్నకు సమాధానం ఎదురు చూస్తే కానీ తెలీదు.
ఇదంతా కాదు. అసలు ఎపుడో శతాబ్దాల క్రితం నాటి తమ జాతి ఉచ్చ స్థితిని తిరిగి తీసుకు రావాలని రష్యాలో పుతిన్, టర్కీ లో యెర్డొహాన్, చైనా లో షీ జింపింగ్, భారత్ లో మోడీ ప్రయత్నించడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ 21వ శతాబ్ధంలో, అలెక్జాండర్ నాటి రాజ్యవిస్తరణ కాంక్షకు అస్సలు అర్ధం లేదు. దీనంతటికీ కారణమైన అసలు తప్పు ఎవరిదీ అంటే, ఇంకా కేంద్రీకృతమయి ఉన్న అధికారానిదీ, దేశభక్తి పేరుతొ జాతీయ అతి వాదాన్ని నూరి పోసే తిరోగమన వాదాలదీ, ఒక వ్యక్తి చేతుల్లో 21వ శతాబ్దంలో కూడా ఇంతటి మిలిటరీ అధికారాన్ని కట్టబెట్టే వ్యవస్తలదీ!
No comments:
Post a Comment