Saturday, September 20, 2025

భారత దేశానికి ప్రధాన శత్రువు

 భారత దేశానికి ప్రధాన శత్రువు ఇతర దేశాలపై ఆధారపడడమా? ఇంతకీ ఎందుకు మనం ఆధారపడవలసి వస్తోంది?

ఎగుమతుల సంగతి దేవుడెరుగు, మన మానుఫాక్చరింగ్ రంగం మన అవసరాలను కూడా ఎందుకు తీర్చలేకపోతుంది? ఎందుకు మన ఉత్పత్తులు చైనా కంపెనీలతో పోటీ పడలేక పోతున్నాయి?
మన అసలైన శత్రువులు ఇవి:
- గవర్నమెంట్ ఇంకా రెగ్యులేషన్ లను కొనసాగిస్తుండడం.
- అత్యంత అవసరమయిన సంస్కరణలను బుట్ట దాఖలు చెయ్యడం.
- గవర్నమెంట్ వ్యాపారం చెయ్యాలని చూడడం. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చెయ్యకపోవడం.
- రాజకీయ పార్టీల దృష్టంతా వచ్చే ఎన్నికలు గెలవడమెలా అని తప్పితే దేశాన్ని ఆర్ధికంగా ఎలా అభివ్రుద్ధి చెయ్యాలో పట్టక పోవడం.
- విద్య, ఆరొగ్యం, పోలిసింగ్ విషయంలో సంస్కరణలు తేవాలని అస్సలు పట్టక పోవడం.
- ఘోరమయిన న్యాయ వ్యవస్థ
- స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చెయ్యకుండా అంతా PM/CM/DM చుట్టూరా తిరిగేటట్టు చెయ్యడం.
రెగ్యులేషన్ల వల్ల, అలవి కాని రూల్స్ వల్ల బలి అయ్యేది చిన్న-మధ్య తరహా పరిశ్రమలే. నానా రకాల రూల్స్ పేరిట గవర్నమెంట్ అధికారులు పీడించడంతో వ్యాపారవేత్తలు పరిశ్రమలు పెట్టాలంటే జంకే పరిస్తితి. ఎందుకు అంత రిస్క్ తీసుకోవడం? బంగారం, రియల్ ఎస్టేట్ లపై పెడితే సరిపోతుందిగా! ఇంక బడా పారిశ్రామికవేత్తలకు రాజకీయ నాయకులనూ, అధికారులను మచ్చిక చేసుకోవడం వెన్నతో పెట్టిన విద్య. రూల్స్ ఎన్ని ఎక్కువ వుంటే అంత మంచిది. పోటీ అనేది వుండదు. ఎంత నాసిరకమయిన ఉత్పత్తి అయినా, ధర ఎంత ఎక్కువున్నా వినియోగదారులు చచ్చినట్లు కొనాల్సిందే! ఇతర దేశాల కంపెనీలు తక్కువ ధరకు అందిస్తున్నాయా? దిగుమతులపై సుంకం విధించాలని గవర్నమెంట్ పై వత్తిడి తెస్తే సరి!
- అసలు పరిశ్రమలు నడపాలంటే కార్మిక చట్టాల సంస్కరణ చెయ్యాలి కదా?
- పరిశ్రమకు భూమి కావాలంటే భూసేకరణ అత్యంత క్లిష్టమయినది కదా?
- వ్యవసాయ చట్టాలను ఎప్పుడు మరి సంస్కరించడం?
ప్రభుత్వ ప్రమేయం ఉంటే ఇంక ఆ రంగం సంక నాకి పొయినట్టే అని తెలిసే కదా, ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేయ్యడం ప్రారంభించింది పీవీ, వాజపేయిలు. మరి ఇప్పుడు నేను ఏదో ఉద్ధరిస్తాను అని బయల్దేరడమేంటి?
కనీసం రక్షణ రంగం లోనన్నా ప్రైవేటు సంస్థలకు అనుమతులు ఇచ్చారు, సంతోషం! లేకపోతే దశాబ్దాల తరబడి పరిశోధనలు చేసినా ఒక్క సరయిన ఎయిర్క్రాఫ్ట్ ఎంజిన్ కూడా సరిగా ఉత్పత్తి చెయ్యడం HAL వల్ల కాలేదు!
ఇవన్నీ చెయ్యకుండా ఆత్మనిర్బర్ భారత్ అని జబ్బలు చరుచుకుని కాలం వెళ్ళదీస్తే, రేపు ఆర్ధికంగానే కాదు, దేశ రక్షణ పరంగా కూడా ప్రమాదమే!

No comments: