Sunday, May 21, 2023

కాంగ్రెస్ వద్ద ఈ ప్రశ్నలకు బదులుందా?

అవును! మోడీ అసమర్ధుడే. అతని తుగ్లక్ పరిపాలన వల్ల దేశ ఆర్ధికాబివ్రుద్ధి కుంటుబడింది. మరి దేశ ప్రజలకు ప్రస్తుతం ఉన్న ప్రత్యామ్నాయమేంటి? స్వాతంత్ర్యం తెచ్చిన కాంగ్రెస్సా? మరి కాంగ్రెస్ వద్ద ఈ కింది ప్రశ్నలకు బదులుందా?

- ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకమేనా? కాశ్మీర్ భారత దేశంలో ఒక విడదీయలేని అంతర్భాగం కాదా?
- అయోధ్యలో రామ మందిరం కట్టవద్దా? బాబ్రి మసీద్ నే ఉండనివ్వాలా?
- రాహుల్ గాంధీ అన్నట్టు దేశానికి ఉన్న పెద్ద ముప్పుల్లో హిందూ అతివాదం అతి ముఖ్యమయినదా?
- మైనారిటీలను ప్రసన్నం చేసుకోవడంలో మీ అత్యుత్శాహాన్ని అలాగే కొనసాగిస్తారా?
- మంత్రుల అవినీతిని అరికట్టలేరా? మీ మంత్రివర్గం అంటే ఎవరికి అందినది వారు దోచుకొనే ఒక బందిపోటు గుంపేనా?
- ఎన్.జీ.వోల ముసుగులో వివిధ దేశాలు సాగిస్తున్న మత మార్పిల్లను అడ్డుకోరా?
- వివిధ దేశాలు ఎన్.జీ.వోల ముసుగులో మన అభివ్రుద్దిని అడ్డుకుంటుంటే (demonstrations against Mining etc.) చోద్యం చూస్తారా?
- దేశ రక్షణలో కీలకమయిన విషయాల్లో మీరు భారత దేశం వైపు కాదా? చైనా కవ్వింపులకి మీరు ధీటుగా సమాధానమివ్వగలరా?

ఈ పై ప్రశ్నలకు కాంగ్రెస్ సమాధానం భారత దేశం వైపే అని నిరూపించుకొనేదాక ప్రజలు భా.జ.పాకి తమ వోటు వేస్తూనే వుంటారు. అదానీ ఎంత తిన్నా, మోడీ ఎంత అసమర్దుడైనా! ఈ పై విషయాల్లో రాజీ పడడానికి ప్రజలు సిద్ధంగా లేరు. పై విషయాల్లో స్పష్టత లేకపోతే ఏ పార్టీకైనా జాతీయ ఎన్నికల్లో గెలుపు అసాధ్యం.

మరి కాంగ్రెస్ నాయకత్వం ఇది గుర్తించిందా? తదనుగుణంగా ఏమైనా మార్పులు చేసుకుంటుందా? ఖచ్చితంగా లేదు! ఆం.అద్మి పార్టీ (AAP) మాత్రం ఇది గుర్తించి కాంగ్రెస్ స్థానాన్ని మెల్లిగా ఆక్రమించుకొంటుంది. ఇలాగే కొనసాగితే కాంగ్రెస్ ముక్త్ భారత్ సాకారం కావడం తధ్యం!

Sunday, May 14, 2023

రాష్త్ర స్థాయి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు

 గాంధీ-నెహ్రూ కుటుంబం నుంచి బలమయిన నాయకత్వం లేకున్నా రాష్త్ర స్థాయి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవగలదని కర్ణాటక ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. రాష్ట్ర ఎన్నికల్లో గెలుపుకు కాంగ్రెస్ కు కావలసింది ఒక బలమయిన రాష్ట్రస్థాయి నేత. అయితే క్షేత్రస్థాయిలో నిజంగా పట్టు ఉన్న నాయకులు ఎవరో తెలుసుకోగలిగిన వివేకం-విచక్షణ ఇందిరా గాంధీ తరవాతి తరాల్లో లోపించింది. దీనితో, సర్పంచ్ లేక కార్పరేటర్ గా కూడా గెలవలేకున్నా, కేవలం అదిష్ఠానంతో ముఖ పరిచయం ఉందన్న కారణంగా రాష్ట్ర కాంగ్రెస్ లో చక్రం తిప్పే నేతల ఏలుబడిలో కాంగ్రెస్ రాష్ట్రాల్లో కుదేలవుతోంది.

34 యేళ్ళకే పీ.సి.సి అద్యక్షుడయినా, వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా రాష్ట్రంలో పట్టు సాధించడానికి చాలా కాలం వేచి చూడాల్సి వచ్చింది. మొత్తానికి 1998లో మళ్ళీ పీ.సి.సి అద్యక్షుడయ్యి, 1999-2004 మధ్యలో శాసన సభలో ప్రతిపక్ష నేతగా పనిచేసి, పార్టీ పై పట్టు సాధించుకొని పాదయాత్ర చేసి 55 యేళ్ళకు సి.యం పదవి చేపట్టాడు. అయినా కూడా, జి.వెంకటస్వాముల-ఎం.సత్యనారాయణల బెడద మాత్రం తప్పలేదు.
రేవంత్ రెడ్డి అన్నట్టు కాంగ్రెస్ అంటే ఎవరికి వారు ముఠాలుగా విడిపోయి, ఎవరి ఆట వారు ఆడుకునే ఒక మునిసిపల్ ఆట స్థలం! ఈ ఆటస్థలంలో అందరూ కలిసి ఒక జట్టుగా ఆడేలా చేసే ఒక బలమయిన రాష్ట్రస్థాయి నాయకుడు ఉంటే కాంగ్రెస్ కు అదిష్టానంలో ఎవరు వున్నారు అన్నది ఒక సమస్య కాదు. కానీ, అలాంటి ఒక పస ఉన్న నేతను బలమయిన నాయకుడిగా, అదిష్ఠానం, వారితో-ముఖపరిచయం-ఉన్న-కొరగాని-నాయకులు ఎదగనిస్తారా అన్నది ప్రశ్నార్ధకం.
తెలంగాణా కాంగ్రెస్ లో బాహుబలి లాంటి నాయకుడు ఎదుగుతాడని కొన్నాళ్ళ కిందట జానా రెడ్డి జోస్యం చెప్పాడు. అతను రేవంత్ రెడ్డయితే కాదు. పరిణితి-పరిజ్ఞానం-నేర్పు-సామర్ధ్యం ఉన్న నాయకుడు వస్తే తెలంగాణలొ గానీ, మరే రాష్ట్రంలొ గానీ కాంగ్రెస్ అధికారం హస్తగతం చేసుకోగలదు. అదిష్ఠానంలో నెహ్రూ-గాంధీ కుటుంబసభ్యులు ఉన్నా-లేకున్నా పెద్ద తేడా ఏమీ ఉండదు!

Wednesday, May 03, 2023

ఎంపీ సీట్ కొల్పోనున్న రాహుల్ గాంధి. కాంగ్రెస్ పయనం మరి ఎటువైపు?

 రాహుల్ గాంధీ పై కోర్ట్ కేస్, తదనంతరం అతను తన ఎంపీ సీట్ కోల్పొవడం పై మరీ అంతగా బాధ పడక్కరలేదేమో! అవును, ఇది భారతదేశంలో ప్రజాస్వామ్య పతనానికి ఒక సూచిక. న్యాయస్థానాలు కూడా మోడి-షా గుప్పిట్లో ఉన్నాయనడానికి ఇది మరో నిదర్శనం.

మోడిపై, భారతదేశంలో ప్రజాస్వామ్య లేమిపై రాహుల్ విదేశాల్లో చేసిన వ్యాఖ్యలకు ఇది ప్రతిచర్య అనుకోవచ్చు. తన అనాలోచిత వ్యాఖ్యలతో మోడీకి మాత్రమే గాక భారతదేశ ప్రతిష్టకూ చేటు చేస్తున్నానని ఎరగక పోవడం రాహుల్ తప్పిదమే.
భారతదేశ రాజకీయాల పై నెహ్రూ-గాంధీ వంశానికి ఉన్న పట్టును తగ్గించడం మొడీ-షా ల ప్రధాన రాజకీయ లక్ష్యాలలో ఒకటి. తరాల తరబడి ఉన్న నమ్మకం-ఆరాధన, ఇంకా ఎంత కాదన్నా 20% ప్రజా మద్దతు ఉన్న ఒక వంశాన్ని నీరుగార్చడం అంటే అంత సులభమేమీ కాదు. ఇంతటి చరిత్ర, గుడ్డి నమ్మకం-మద్దతు ఉన్న వంశాన్ని ముక్కుసూటిగా పోయి, ప్రజాస్వామ్య పద్ధతుల్లో నీరుగార్చాలంటే ఇంకెన్ని తరాలు పడుతుందో చెప్పక్కరలేదు.
రాహుల్ కి వంశాంకురాలు లేకపోయినా, ప్రియాంకనో, ఆమె సంతతినో భుజాలకెక్కించుకొని తొక్కించుకోవడం తప్ప సిగ్గు-శరం లేని మనకు ప్రజాస్వామ్య పద్ధతులు అంతగా పనికిరావేమో! విదేశాల్లో రాహుల్ చేసిన అనాలోచిత వ్యాఖ్యలు ఎప్పటికయినా కావాల్సిన పతనాన్ని వేగవంతం చేశాయంతే!
ఇంతకీ దేశానికి ఏమి ఒరగబెట్టిందని ఆ వంశాన్ని తలకెత్తుకోవాలో ఏమో! నెహ్రూ వరకయితే, చారిత్రిక తప్పిదాలు ఎన్ని వున్నా, ఉద్దేశాలు-చిత్తశుద్ధిలో శంక లేదు కాబట్టి పరవాలేదు. ఇంక ఇందిర, ఆపై సంజయ్-రాజీవ్ ల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. తాము పడితే భూమిని అంతగా దద్ధరిళ్ళింపచేశే వ్రుక్షాలుగా నీరు పోసి వారిని అంతగా పెంచి పెద్ద చెయ్యటం ఎందుకో!
రాహుల్ సంగతికొస్తే వ్యక్తిగతంగా సౌమ్యుడిగా, ఏవో ఆదర్శాలు ఉన్నవాడిగా అగుపిస్తాడు. కానీ, ఆచరణ కొచ్హేసరికి క్షేత్రస్థాయిలో ఏమాత్రం అవగాహన, స్పష్టత లేని వాడిగా గోచరిస్తాడు. ప్రజల నాడిని పట్టుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాడు. క్షేత్రస్థాయిలో పట్టు ఉన్న నేతలను వదిలి, చుట్టూ చేరిన అంతరంగికుల మరియు భజనపరుల మాటలు విని, నిర్ణయాలు తీసుకొని కాంగ్రెస్ పార్టీ వినాశనాన్ని కొని తెచ్చుకోవడం మనమందరం చూసినదే.
కాంగ్రెస్ అంతం అవడం దేశానికి మంచిదే. స్వాతంత్ర్యం రాగానే రద్దు చేసి, ప్రజల రాజకీయ భావాల వ్యక్తీకరణకు ఒక సమాన పీఠాన్ని ఏర్పాటు చెయ్యాల్సిన బాధ్యతను మన మేరు శిఖరాలయిన నేతలు విస్మరించడంతో భారతదేశం కోల్పోయినది ఎంతంటే, ప్రపంచ దేశాల్లో ఇప్పుడు మన వెనుకబాటంత!
జాతీయ స్థాయిలో ఒక బలమయిన ప్రతిపక్షం అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే అధికార పక్షానికి పట్టా పగ్గాలు ఉండవు! కాంగ్రెస్ ఖాళీ చేస్తున్న ఈ స్థానాన్ని ఆం ఆద్మీ పార్టీ (AAP) భర్తీ చెయ్యాలని చూస్తున్నది. ఈ పరిణామం మొడీ-షాల ఎరుకలో లేకపోలేదు. అయితే ఈ ప్రస్థానంలో అం ఆద్మీ పార్టీ ప్రతి అంగుళానికీ భాజపాతో తీవ్రమయిన పోరాటం చేయక తప్పదు. ఈ రాబొయే పదేళ్ళలో అరవింద్ కేజ్రీవాల్ సరయిన నాయకత్వం అందిస్తే, 2034 లో ఆప్ (AAP) భాజపా తో నువ్వా-నేనా అన్నంతగా పోటీ పడగలదు అనడంలో సందేహం లేదు!