గాంధీ-నెహ్రూ కుటుంబం నుంచి బలమయిన నాయకత్వం లేకున్నా రాష్త్ర స్థాయి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవగలదని కర్ణాటక ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. రాష్ట్ర ఎన్నికల్లో గెలుపుకు కాంగ్రెస్ కు కావలసింది ఒక బలమయిన రాష్ట్రస్థాయి నేత. అయితే క్షేత్రస్థాయిలో నిజంగా పట్టు ఉన్న నాయకులు ఎవరో తెలుసుకోగలిగిన వివేకం-విచక్షణ ఇందిరా గాంధీ తరవాతి తరాల్లో లోపించింది. దీనితో, సర్పంచ్ లేక కార్పరేటర్ గా కూడా గెలవలేకున్నా, కేవలం అదిష్ఠానంతో ముఖ పరిచయం ఉందన్న కారణంగా రాష్ట్ర కాంగ్రెస్ లో చక్రం తిప్పే నేతల ఏలుబడిలో కాంగ్రెస్ రాష్ట్రాల్లో కుదేలవుతోంది.
34 యేళ్ళకే పీ.సి.సి అద్యక్షుడయినా, వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా రాష్ట్రంలో పట్టు సాధించడానికి చాలా కాలం వేచి చూడాల్సి వచ్చింది. మొత్తానికి 1998లో మళ్ళీ పీ.సి.సి అద్యక్షుడయ్యి, 1999-2004 మధ్యలో శాసన సభలో ప్రతిపక్ష నేతగా పనిచేసి, పార్టీ పై పట్టు సాధించుకొని పాదయాత్ర చేసి 55 యేళ్ళకు సి.యం పదవి చేపట్టాడు. అయినా కూడా, జి.వెంకటస్వాముల-ఎం.సత్యనారాయణల బెడద మాత్రం తప్పలేదు.
రేవంత్ రెడ్డి అన్నట్టు కాంగ్రెస్ అంటే ఎవరికి వారు ముఠాలుగా విడిపోయి, ఎవరి ఆట వారు ఆడుకునే ఒక మునిసిపల్ ఆట స్థలం! ఈ ఆటస్థలంలో అందరూ కలిసి ఒక జట్టుగా ఆడేలా చేసే ఒక బలమయిన రాష్ట్రస్థాయి నాయకుడు ఉంటే కాంగ్రెస్ కు అదిష్టానంలో ఎవరు వున్నారు అన్నది ఒక సమస్య కాదు. కానీ, అలాంటి ఒక పస ఉన్న నేతను బలమయిన నాయకుడిగా, అదిష్ఠానం, వారితో-ముఖపరిచయం-ఉన్న-కొరగాని-నాయకులు ఎదగనిస్తారా అన్నది ప్రశ్నార్ధకం.
తెలంగాణా కాంగ్రెస్ లో బాహుబలి లాంటి నాయకుడు ఎదుగుతాడని కొన్నాళ్ళ కిందట జానా రెడ్డి జోస్యం చెప్పాడు. అతను రేవంత్ రెడ్డయితే కాదు. పరిణితి-పరిజ్ఞానం-నేర్పు-సామర్ధ్యం ఉన్న నాయకుడు వస్తే తెలంగాణలొ గానీ, మరే రాష్ట్రంలొ గానీ కాంగ్రెస్ అధికారం హస్తగతం చేసుకోగలదు. అదిష్ఠానంలో నెహ్రూ-గాంధీ కుటుంబసభ్యులు ఉన్నా-లేకున్నా పెద్ద తేడా ఏమీ ఉండదు!
No comments:
Post a Comment