Wednesday, May 03, 2023

ఎంపీ సీట్ కొల్పోనున్న రాహుల్ గాంధి. కాంగ్రెస్ పయనం మరి ఎటువైపు?

 రాహుల్ గాంధీ పై కోర్ట్ కేస్, తదనంతరం అతను తన ఎంపీ సీట్ కోల్పొవడం పై మరీ అంతగా బాధ పడక్కరలేదేమో! అవును, ఇది భారతదేశంలో ప్రజాస్వామ్య పతనానికి ఒక సూచిక. న్యాయస్థానాలు కూడా మోడి-షా గుప్పిట్లో ఉన్నాయనడానికి ఇది మరో నిదర్శనం.

మోడిపై, భారతదేశంలో ప్రజాస్వామ్య లేమిపై రాహుల్ విదేశాల్లో చేసిన వ్యాఖ్యలకు ఇది ప్రతిచర్య అనుకోవచ్చు. తన అనాలోచిత వ్యాఖ్యలతో మోడీకి మాత్రమే గాక భారతదేశ ప్రతిష్టకూ చేటు చేస్తున్నానని ఎరగక పోవడం రాహుల్ తప్పిదమే.
భారతదేశ రాజకీయాల పై నెహ్రూ-గాంధీ వంశానికి ఉన్న పట్టును తగ్గించడం మొడీ-షా ల ప్రధాన రాజకీయ లక్ష్యాలలో ఒకటి. తరాల తరబడి ఉన్న నమ్మకం-ఆరాధన, ఇంకా ఎంత కాదన్నా 20% ప్రజా మద్దతు ఉన్న ఒక వంశాన్ని నీరుగార్చడం అంటే అంత సులభమేమీ కాదు. ఇంతటి చరిత్ర, గుడ్డి నమ్మకం-మద్దతు ఉన్న వంశాన్ని ముక్కుసూటిగా పోయి, ప్రజాస్వామ్య పద్ధతుల్లో నీరుగార్చాలంటే ఇంకెన్ని తరాలు పడుతుందో చెప్పక్కరలేదు.
రాహుల్ కి వంశాంకురాలు లేకపోయినా, ప్రియాంకనో, ఆమె సంతతినో భుజాలకెక్కించుకొని తొక్కించుకోవడం తప్ప సిగ్గు-శరం లేని మనకు ప్రజాస్వామ్య పద్ధతులు అంతగా పనికిరావేమో! విదేశాల్లో రాహుల్ చేసిన అనాలోచిత వ్యాఖ్యలు ఎప్పటికయినా కావాల్సిన పతనాన్ని వేగవంతం చేశాయంతే!
ఇంతకీ దేశానికి ఏమి ఒరగబెట్టిందని ఆ వంశాన్ని తలకెత్తుకోవాలో ఏమో! నెహ్రూ వరకయితే, చారిత్రిక తప్పిదాలు ఎన్ని వున్నా, ఉద్దేశాలు-చిత్తశుద్ధిలో శంక లేదు కాబట్టి పరవాలేదు. ఇంక ఇందిర, ఆపై సంజయ్-రాజీవ్ ల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. తాము పడితే భూమిని అంతగా దద్ధరిళ్ళింపచేశే వ్రుక్షాలుగా నీరు పోసి వారిని అంతగా పెంచి పెద్ద చెయ్యటం ఎందుకో!
రాహుల్ సంగతికొస్తే వ్యక్తిగతంగా సౌమ్యుడిగా, ఏవో ఆదర్శాలు ఉన్నవాడిగా అగుపిస్తాడు. కానీ, ఆచరణ కొచ్హేసరికి క్షేత్రస్థాయిలో ఏమాత్రం అవగాహన, స్పష్టత లేని వాడిగా గోచరిస్తాడు. ప్రజల నాడిని పట్టుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాడు. క్షేత్రస్థాయిలో పట్టు ఉన్న నేతలను వదిలి, చుట్టూ చేరిన అంతరంగికుల మరియు భజనపరుల మాటలు విని, నిర్ణయాలు తీసుకొని కాంగ్రెస్ పార్టీ వినాశనాన్ని కొని తెచ్చుకోవడం మనమందరం చూసినదే.
కాంగ్రెస్ అంతం అవడం దేశానికి మంచిదే. స్వాతంత్ర్యం రాగానే రద్దు చేసి, ప్రజల రాజకీయ భావాల వ్యక్తీకరణకు ఒక సమాన పీఠాన్ని ఏర్పాటు చెయ్యాల్సిన బాధ్యతను మన మేరు శిఖరాలయిన నేతలు విస్మరించడంతో భారతదేశం కోల్పోయినది ఎంతంటే, ప్రపంచ దేశాల్లో ఇప్పుడు మన వెనుకబాటంత!
జాతీయ స్థాయిలో ఒక బలమయిన ప్రతిపక్షం అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే అధికార పక్షానికి పట్టా పగ్గాలు ఉండవు! కాంగ్రెస్ ఖాళీ చేస్తున్న ఈ స్థానాన్ని ఆం ఆద్మీ పార్టీ (AAP) భర్తీ చెయ్యాలని చూస్తున్నది. ఈ పరిణామం మొడీ-షాల ఎరుకలో లేకపోలేదు. అయితే ఈ ప్రస్థానంలో అం ఆద్మీ పార్టీ ప్రతి అంగుళానికీ భాజపాతో తీవ్రమయిన పోరాటం చేయక తప్పదు. ఈ రాబొయే పదేళ్ళలో అరవింద్ కేజ్రీవాల్ సరయిన నాయకత్వం అందిస్తే, 2034 లో ఆప్ (AAP) భాజపా తో నువ్వా-నేనా అన్నంతగా పోటీ పడగలదు అనడంలో సందేహం లేదు!



No comments: